గిల్ట్ ఫీలింగ్ మోసుకెళుతున్న క్షణాలు..

21-3-2024 శ్రీశాంతి మెహెర్..


జీవితం అంటే కాలంలో కదిలిపోవడమే అని ఓ పెద్దాయన చెప్పాడు. అదే చలం అన్నమాటే.. కాలం కదిలిపోవడం కాదు.. మనకున్న హడావుడికి కాలం పరుగులు పెడుతుంది. చాలా గడబిడలో చాలా చేయాలనుకుని చేయలేని సందర్భాలు చాలానే ఉంటాయి. నాకు నేను పరుగెత్తి పరుగెత్తీ అలసిపోయి.. ఆగిచూస్తే అక్కడ కూడా సమయమే వెక్కిరిస్తూ కనిపిస్తుంది. సమయాన్ని పట్టుకుందామని చూస్తున్న ప్రతిసారీ రెట్టించిన ఉత్సహంతో పరుగుపెడుతూనే ఉంటుంది. 

సరే సమయం వెనుక పరుగులో నేను చేసే పెద్ద గిల్డ్ పనేంటంటే.. బాబుని గేటుదగ్గర వాచ్ మేన్ చూడకుండా స్కూల్ ముందు దింపేసి, అదిగో అక్కడే మొదలవుతుంది నా గిల్ట్.. వాడికి కనిపించకుండా ఎందుకు దిగబెట్టడం అంటే పిల్లాడి స్కూల్ షూస్ పాలీష్ లేవని, సాక్స్‌లు సరిగా ఉతకలేదని ఇలా ఏదో సాకుతో ఆపి మరీ పంచాయితీ పెడుతుంటాడు. అందుకోసం వాడికి కనిపించకుండా స్కూల్ గేటుకు కాస్త ముందో, లేదా స్కూల్ బస్ చాటునో పిల్లాడిని వదిలేసి వెళిపోతుంటాను. 

ఇక గిల్ట్ రెండు.. స్కూల్ తతంగం కాగానే రోడ్డు పట్టుకుని బయలుదేరతానా.. ఎంత దగ్గరగా రూట్ దొరుకుతుందా.. ఎంత త్వరగా ఆఫీస్ కి వెళిపోదామా అనే ఆలోచన ఒక్కటే మెదడుని పట్టుకుని కుదిపేస్తూ ఉంటుంది. కాస్త కంగారుగానే దగ్గరి దారి వెతుకుతూ పోతాను. సరిగ్గా యూసఫ్ గూడా దాటిన తర్వాత అక్కడే నా బుద్ది మారిపోతుంది. ఎలాగైనా రాంగ్ రూట్ వైపు పోదామనిపిస్తుంది. అక్కడే నేను పరమ గిల్ట్ గా ఫీల్ అవుతూ రాంగ్ రూట్ వైపు ప్రయాణమవుతాను. అలా వెళుతున్నప్పుడు బాధతో కూడిన ఫీలింగ్.. ఛా ఆంధ్రజ్యోతి ట్యాగ్ ఉన్న బండిమీద జర్నలిస్ట్ గా ఉన్న నేను ఇలా రాంగ్ రూట్ పడుతున్నాను. ఆదర్శంగా ఉండాలి కదా.. ఇలా చేస్తున్నానేంటి అని తెగ బాధ పడుతూ కాస్త ముఖాన్ని హెల్మెట్ తో కప్పేసుకుని, దాదాపు ఎదురుగా వస్తున్నవారిని పట్టించుకోనట్టు దాటుకుని వెళిపోవడం మొదలుపెడతాను. అలా వెళుతున్న నాకు సరిగ్గా యూసఫ్ గూడ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసరికి ట్రాఫిక్ పోలీస్ కనిపించాడో ఇక అంతే సంగతులు.. మళ్ళీ రూటు మార్చి కాస్త దూరం ప్రయాణించడం తప్పదు. లేదంటే పెట్రోల్ బంక్ దాటి 1524 మెట్రో పిల్లర్ దగ్గర హమ్మయ్యా అని రోడ్ దాటేసి.. గిల్ట్ ని వదిలేసి స్పీడ్ పెంచి జూబ్లీహిల్స్ వైపు పయనమవుతాను. 

ఇంత గిల్ట్ ఫీలవుతాను కానీ.. రోజూ అదే పని చేస్తుంటాను.. అలా చూడకండి. అదే కదా నా గిల్ట్.. మీరు కూడా నాలా రోజూ కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు రాంగ్ రూట్ పట్టే ఉంటారు కదా.. నేను ఒక్కద్దాన్నే రోడ్ దాటినట్టు ఓవర్ చేయకండి. మీరు మాత్రం డ్రాకుల్లా లాంటి ఉద్యోగుల మధ్య పనిచేయడం లేదా ఏంటీ....

Comments

Popular posts from this blog

వైరాగ్యానికి అటు ఇటు..

walk alone