ఈ సీతాకోక డిజైన్ ఉంది చూసారూ.. నాకు రోత పుట్టించింది..
శ్రీశాంతి.. 20-3-2024
వాగులు వంకలు పొంగి పొరలి ఊళ్ళ మీదకు వచ్చి ముంచి పోయిన ప్రతి సారీ మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తాయి ఊళ్ళు... నిజానికి కొత్తగా పుట్టడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే. పరిస్థితులకు తగినట్టుగా, పరిసరాలకు అనువైన విధంగా మనల్ని మనం మార్చుకోవడం ఎప్పుడూ జరిగే విషయమే. కాలానికి తగినట్టుగా ఉండటం అనేది అంత సులువైన విషయం కూడా కాదు. చాలా విషయాల్లో మనల్ని గేలి చేసే వ్యక్తుల నుంచి, ఎద్దేవల నుంచి కొత్తగా పుట్టుకు రావడం అంటే కాస్త పెద్ద పనే..
కొత్తదనాన్ని ఏ విషయంలో గమనించినా కూడా సంబరంగా ఉంటుంది నాకు. కాస్త చిత్రంగా కూడా.. ఒకప్పుడు సీతాకోక చిలుకల్ని చూసినప్పుడు భలే ముచ్చట వేసేది. ఎంత ముచ్చట అంటే దాన్ని పట్టుకుని చేతుల్లోకి తీసుకుని మురిసిపోయేంత ఇష్టంగా అనిపించేది. అయితే ఆ ఇష్టం అలా ఉండగానే ప్రకృతిలో మార్పు, పరిసరాల్లో మార్పుల కారణంగా ఎప్పుడన్నా ఏ సినిమా సీన్ మధ్యో తప్పితే సీతాకోక చిలుకలు కనిపించేది తక్కువైపోతున్న తరుణంలో సడెన్ గా.. అంటే చాలా సడెన్ గా మళ్లీ సీతాకోక చిలుకలు కనిపించడం మొదలయ్యాయి. అవి చీరల మీదకు వచ్చే సరికి అబ్బా.. ఈ డిజైన్ భలే ఉందే అని కొనేసి, పక్కన పెట్టుకుని మురిసిపోయి,. కట్టుకుందాం అనేసరికి.. ఎక్కడ పడితే అక్కడ ఆ సీతాకోకలే.. ఆ కోకలు చూసీ చూసీ చిరాకేసి.. ఇక నాకున్న కోకని లోపల పెట్టేసేంత చిరాకు కలిగింది.
ఒకప్పుడు వాణిశ్రీ నక్లెస్, చీరలు, కొప్పులని తెగ మోజుగా కొనేవారట.. శ్రీదేవి ముక్కుపుడక కూడా ఫేమస్సే.. అదలా ఉంటే.. ఇప్పుడు ఎక్కడ చూసినా సీతాకోక చిలుకలున్న డిజైన్ చీరలే.. అబ్బా..ఠారెత్తిపోతుంది నాకు.. ఛాఛా మరీ ఇంతలా అనుసరిస్తారా డిజైన్ ఎంత బావుంటే మాత్రం. ప్రతి ఒక్కరూ అదే చీరల్లో కనిపిస్తుంటే.. భూమి మరీ ఇంత చిన్నగా ఉందేంటి.. నా ఖర్మకాకపోతేనూ అనుకుంటున్నాను.. రామ రామ ఈ సీతాకోక చిలక డిజైన్ ఇప్పుడు జడ క్లిప్పులకు కూడా పాకింది. ఎవరి తలలో చూసినా అవే క్లిప్పులు.. ఇక ముచ్చటపడి కొనుక్కున్న నా క్లిప్పుల్ని ఏం పెట్టుకుంటాను.. లోపల పడేసాను.
మరీ పిచ్చిగా దేనిమీదా ఆశ పడకూడదని.. కాలం గడుస్తున్న కొద్దీ అర్థం అవుతున్నట్టే ఉంది కానీ.. కావడంలేదు.. పాడు బర్రకు.. ఏ డిజైన్ మార్కెట్‌లోకి వచ్చినా అలా మోజుపడిపోవడమేనా... తప్పుకదూ.. ఊ.
Comments
Post a Comment